గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస కనీవినీ ఎరుగని విజయాన్ని సాధించింది. సెంచరీకి ఒక్క సీటు దూరం లో తెరాస ప్రభంజనం నిలిచింది. మొత్తానికి రెండింట మూడు వంతుల మెజారిటీ సాధించింది. తెదేపా, కాంగ్రెస్, బిజెపి లు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ స్థాయిలో ఫలితాలు ఉంటాయని తెరాస అధినేత కెసిఆర్, ఆయన కుమారుడు కెటిఆర్ కూడా ఊహించి ఉండరు. కేసిఆర్ గ్రేటర్ ఎన్నికలని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ పెట్టినప్పటి నుండి మొన్న అసెంబ్లీ ఎన్నికల దాకా తనకి పట్టుదొరకని హైదరాబాద్ లో పాగా వేయడమే లక్ష్యంగా కెసిఆర్ పావులు కదిపారు. తలసాని, తీగల, తుమ్మల లాంటి తెదేపా నాయకులని పార్టీలో చేర్చుకుని తన సొంత పార్టీని బలోపేతం చేసుకుని, తెదేపా కి దెబ్బ వేసారు. తెదేపా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయి, అది బాగా బలహీనపడే దాకా గ్రేటర్ ఎన్నికలు జరపకుండా వాయిదా వేసారు. ఒక్కసారి తాము గెలుస్తామనే నమ్మకం రాగానే ఎన్నికలు ప్రకటించారు. కింది స్థాయి కాంగ్రెస్, తెదేపా నాయకులయితే ఎంతమంది తెరాస లో చేరారో లెక్కబెట్టడం కూడా కష్టం.
ఒక పక్క సంస్థాగతంగా బలపడటం, మరోపక్క అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు తెరాస కి ఓట్ల వరద పారించాయి. హైదరాబద్ కి సరిగ్గా సరిపోయే లీడర్ కేటిఆర్ కి గ్రేటర్ బాధ్యతలు అప్పచెప్పడమే తెరాస కి టర్నింగ్ పాయింట్. కేటిఆర్ తన తండ్రిలా మాస్ ని ఆకట్టుకోగలిగిన మాస్ లీడర్. తన భాషతో, బాడీ లాంగ్వేజ్ తో కేటిఆర్ మాస్ కి బాగా కనెక్ట్ అవుతారు. ఇక ఐటి మంత్రిగా ఆయన చూపిస్తున్న చొరవ మిడిల్ క్లాస్ , ఐటి ఉద్యోగులకి దగ్గర చేసింది.
35 ఏళ్ల చరిత్రలో తెదేపా కి ఇది ఘోర పరాజయం. ఎన్ని రాజకీయ సునామీలు వచ్చిన ఇప్పటిదాకా చెక్కుచెదరకుండా ఉన్న తెదేపా ఓటు బ్యాంక్ గ్రేటర్ ఎన్నికల్లో గల్లంతు అయింది. తెలంగాణ లో తెదేపా కి తిరిగి కోలుకోలేనంత దెబ్బ తగిలింది.ఇంత దారుణ పరాభవానికి కారణాలు అనేకం..తెరాస చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, అధికారబలం, ప్రజల్లో భయం లాంటి అంశాలు తెరాస గెలుపుకి కారణం అయితే.. తెదేపా చేజేతులా చేసుకున్న పొరపాట్లు కొన్ని ఉన్నాయి.
అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఓటుకు నోటు .ఓటుకి నోటు దెబ్బకి చంద్రబాబు లో వణుకు మొదలయ్యింది. దానితో చంద్రబాబు వెంటనే తెల్ల జెండా ఎగరవేసి కాంప్రమైజ్ అయిపోయారు. అమరావతి శంకుస్థాపనకు ఇంటికెళ్ళి పిలవడం, అమరావతిలో కెసిఆర్ కి రాజలాంఛనాలతో స్వాగతం పలకడం , కెసిఆర్ ఛండీయాగానికి చంద్రబాబు హాజరు కావడం తో ఆంధ్ర ప్రజల్లో కెసిఆర్ మీద ఉన్న కోపం తగ్గింది. ఇద్దరు చంద్రులు కలిసిపోయారు, మనకి మాత్రం విబేధాలు ఎందుకు అనే అభిప్రాయం ప్రజల్లో కలిగింది. ఇది ఒక విధంగా ప్రజలకు మంచిదే.
తెరాస అఖండ విజయానికి కారణాలు ఏంటి? అని విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికరమైన నిజాలు వెలుగుచూశాయి.తెరాస సెటిలర్లు అధిక సంఖ్యలో ఉండే కూకట్పల్లి,శేరిలింగంపల్లి,సనత్ నగర్,దిల్షుక్ నగర్, ఎల్బీ నగర్,బియన్ రెడ్డి, కొండాపూర్,మాదాపూర్ వంటి చోట్ల తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది.ఇక్కడి మెజారిటీ సెటిలర్లు తెరాస కి ఓటు వేసారు.అందుకు ప్రధాన కారణం బాబు గారు తెరాస తో కుమ్మక్కు అయ్యారని సగటు సీమాంధ్ర ఓటరు నమ్మడం.గ్రేటర్లో ఉంటున్నాం కాబట్టి ,తమ పనులు జరగాలంటే ప్రభుత్వంతో సఖ్యత అవసరం అని సెటిలర్లు భావించారు.గ్రేటల్లో తెరాస వొడినట్లయితే అందుకు ప్రధాన కారణం సెటిలర్లు అని ప్రభుత్వం భావించి వుండేది.అప్పుడు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకి పాల్పడొచ్చని ఓటర్లు భావించి,తెరాస ని అఖండ మెజారిటీ తో గెలిపించారు.అయితే తెరాస కి ఓటు వేయడం ఇష్టం లేని వారు ఓటింగ్కు దూరంగా వున్నారు.
అయితే నగర శివారుల్లో ఉండే పేద వర్గాలు (సెటిలర్లు) తెరాస కి మనస్పూర్తిగా బ్రహ్మరథం పట్టారు.అందుకు వారి పేదరికం ప్రధాన కారణం. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ,చాలిచాలని ఆదాయంతో పొట్టనింపుకుంటున్న శివారులోని పేదప్రజలు ప్రభుత్వం ఆశ చూపిన డబల్ బెడ్రూం ఇల్లు,ఇంటి పన్ను ఎత్తివేత, ఉచిత నల్ల ( నీరు) వంటి హామీలు తెరాస కి ఓట్ల వర్షం కురిపించింది.అయితే ఇదంతా కొత్త నగరానికి సంబంధించిన విషయం.
ఇక ఓల్డ్ సిటీ విషయానికి వద్దాం.ఇక్కడ తరతరాలుగా mim పాగా వేసింది.అయితే గ్రేటర్ ఎన్నికల్లో mim కంచుకోట బద్దలు కాకపోయినప్పటికీ ( సంఖ్య పరంగా) తెరాస ఓల్డ్ సిటీలో నైతిక విజయం సాధించింది అని చెప్పుకోవచ్చు.ఇక్కడ 25% పైగా mim ఓటు బ్యాంకు తెరాస కి మళ్లింది.ఉదాహరణకి మలక్పేట్ అసెంబ్లీ తీసుకుంటే,అక్కడ mim కి వచ్చిన మొత్తం ఓట్ల కన్నా తెరాస కి 10000 వోట్లు ఎక్కువ వచ్చాయి ( over all).కాని తెరాస అక్కడ కేవలం రెండు చోట్ల మాత్రమె గెలిచింది. తెరాస mim కి చార్మినార్,యకత్పురా,చంద్రాయన్ గుట్ట,గోషామహల్ వంటి చోట తీవ్రమైన పోటీని ఇచ్చింది.ఈ ప్రాంతాలలో తెరాస తన ఓటు బ్యాంకుని గణగీయంగా పెంచుకుంది. ఇక్కడ కూడా ప్రభుత్వ పధకాలు ప్రధాన పాత్ర పోషించాయ్. కళ్యాణ లక్ష్మి,,డబల్ బెడ్రూం ఇల్లు ఇక్కడి ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
మొత్తానికి విపక్షాలలో ఐక్యత లేకపోవడం,ఓటుకు నోటు,ప్రజల పేదరికం, తలా తోక లేని ప్రభుత్వ పధకాలు ,ktr నాయకత్వం తెరాస కి అఖండ విజయాన్ని అందించాయని చెప్పాలి.చివరగా తెరాస కి స్పష్టమైన మెజారిటీ ప్రజలు ఇచ్చారు కనుక,ఇప్పటికైనా ప్రజల నిత్య సమస్యలయినా మంచి నీరు,ట్రాఫిక్ లేని రోడ్ల్లు, పారిశుద్ధ్య ,గతుకులు లేని రోడ్లకి శాశ్వత పరిస్కారం చూపిస్తారని ఆశిద్దాం.