జాతిపిత మహాత్మా గాంధీ జనవరి 30న హత్యకు గురయ్యారు. దేశవిభజన అనంతర పరిణామాల నేపథ్యంలో గాంధీ తీరు రుచించని అతివాదులు ఆయన్ను కాల్చి చంపారు. ఆయన హత్య ఒక్క ఇండియానే కాదు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 1948, జనవరి 30న ఆయన హత్యకు గురయ్యారు. వరుస ఉద్యమాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి కొరకరాని కొయ్యగా మారిన గాంధీ శరీరం మూడంటే మూడు తూటాలకు కుప్పకూలింది. ఆయన హత్యకు దారి తీసిన తక్షణ పరిస్థితులు, అంతకుముందు జరిగిన పరిణామాలపై వివరంగా తెలుసుకుందాం. విభజన జరగకపోతే దేశంలో అంతర్యుద్ధం తప్పదని ముస్లింలీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా హెచ్చరించాడు. దీంతో ఇష్టం లేకున్నా గాంధీ విభజనకు అంగీకరించారు. ఆ సమయంలో వేరుపడిన పాకిస్తాన్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. రూ.75 కోట్లు ఇవ్వాలి. విభజన సమయంలో రూ.20 కోట్లు ఇచ్చిన భారతదేశం మిగిలిన డబ్బును ఇవ్వడానికి అంగీకరించలేదు. ఇస్తే.. ఆ డబ్బుతో తిరిగి భారత్‌పైనే యుద్ధానికి దిగుతుందన్న భయమే కారణం. అయితే, ఈ డబ్బు ఇవ్వకపోతే అంతకుమించిన నష్టం జరుగుతుందని గాంధీ ఆందోళన చెందారు. అందుకే బాకీ డబ్బులు చెల్లించాలంటూ 1948, జవనరి 13న దీక్షకు దిగారు.దీంతో డబ్బు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. పాకిస్తాన్ కోసం గాంధీ దీక్షకు దిగడం దేశంలో చాలామందికి రుచించలేదు. భారత్‌లో విలీనమైన కశ్మీర్‌ను సగం ఆక్రమించుకుని, పాకిస్తాన్‌లో హిందువులు, సిక్కుల ఊచకోతకు పాల్పడుతున్న శత్రుదేశానికి ఆర్థిక సాయం కోసం దీక్షకు దిగడాన్ని కొందరు అతివాదులు ఖండించారు. ఈలోగా నాధూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టే నేతృత్వంలో గాంధీ హత్యకు కుట్ర సిద్ధమైంది. Do you know?
1. గాంధీ హత్య ఎఫ్‌ఐఆర్ ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైంది. 2. నాధూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టే గాంధీని హత్య చేసేందుకు బొంబాయి నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చారు 3. జనవరి 20న బాంబు పేల్చిన మదన్‌లాల్ ధైర్యవంతుడైన కుర్రాడు అని గాంధీ అభివర్ణించాడు. 4. గాడ్సే కాల్చిన తూటాల్లో ఒకటి ఛాతిలోకి దూసుకెళ్లింది. మిగిలిన రెండు పొట్టలోకి చొచ్చుకెళ్లాయి. 5. ఈ కుట్రలో పాల్గొన్న వారంతా ముంబై రాష్ట్రానికి చెందినవారే. 6. గాంధీని చంపడానికి మొత్తం 5 సార్లు హత్యాప్రయత్నాలు జరిగాయి. 7. నాధూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టేలను 1949, నవంబరు 15న ఉరితీశారు. తొలిప్రయత్నం విఫలంకావడం, మదన్‌లాల్ పోలీసులకు దొరికిపోవడంతో మిగిలిన వారు పరారయ్యారు. పోలీసుల నిఘా పెరగడంతో ఈసారి పథకం విఫలం కాకూడదని నాధూరం గాడ్సే కాల్పులు జరపాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా పదిరోజుల అనంతరం 1948, జనవరి 30 సాయంత్రం 5.17 నిమిషాలకు బిర్లా నివాసంలోని ప్రార్థనా సమావేశ మందిరానికి వెళుతుండగా.. ఆయనకు నాధూరాం గాడ్సే ఎదురుపడ్డాడు. గాంధీకి నమస్కరించాడు. ఇప్పటికే ఆలస్యమైందంటూ గాడ్సేను పక్కకు నెట్టేసే ప్రయత్నం చేయబోయింది గాంధీ అనుచరురాలు అఛా ఛటోపాధ్యాయ. కానీ ఆమెను పక్కకు నెట్టిన గాడ్సే తన వెంట తెచ్చుకున్న తుపాకీతో మూడుసార్లు పాయింట్‌బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపాడు. దేశ స్వాతంత్య్రోద్యమానికి నేతృత్వం వహించిన మహానుభావుడు అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే పోలీస్.. పోలీస్! అని అరుస్తూనాధూరాం గాడ్సే లొంగిపోయాడు. గాంధీ హత్యలో నాధూరం గాడ్సే, నారాయణ్ ఆప్టేతోపాటు మిత్రులు సావర్కర్, విష్ణు కర్కరే, శంకర్ కిష్టయ్య, గోపాల్ గాడ్సే, మదన్‌లాల్ బహ్వా, దిగంబర్ బడ్గే చేతులు కలిపారు. అంతా కలిసి ఎలాగైనా గాంధీని అంతమొందించాలని సిద్ధమయ్యారు. హత్య జరిగిన తరువాత పారిపోకూడదని, తమ ఉద్దేశం అందరికీ తెలియపరిచేలా లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. జనవరి 20న ఢిల్లీలోని బిర్లాహౌస్‌లో గాంధీని హత్య చేయాలనుకున్నారు. ముందస్తు పథకం ప్రకారం.. గాంధీ ప్రసంగిస్తున్న వేదిక వెనక వైపు ఉన్న సర్వెంట్ క్వార్టర్స్ నుంచి కాల్పులు జరపాలనుకున్నాడు దిగంబర్ బడ్గే. కానీ, కుదరలేదు. అక్కడ ఉన్న కిటికీ నుంచి గాడ్సే తమ్ముడు గోపాల్ గాడ్సే బాంబు విసురుదామనుకున్నాడు. కానీ, అది మరీ ఎత్తుగా ఉండటంతో అతనికీ సాధ్యపడలేదు. దీంతో వేదిక వద్ద కూర్చున్న మదల్‌లాల్ బాంబు విసిరాడు. కానీ, హత్యాప్రయత్నం విఫలమైంది. మదన్‌లాల్ పోలీసులకు దొరికిపోయాడు.
Credit: sakshi.com