హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో పరిశోధక విద్యార్థి ఆత్మహత్య అత్యంత దురదృష్టకరం. మేధస్సు, సామాజిక స్పృహ, అంతకు మించి మనుషుల మీద ప్రేమ ఉన్న ఓ యువకుడి మరణం సమాజానికి కచ్చితంగా లోటే.
ఈ ఆత్మహత్యకు దారితీసిన కారణాలు, ఆత్మహత్య అనంతరం జరుగుతున్న పరిణామాలు దేశాన్ని ప్రేమించే ప్రతిఒక్కరికీ తీవ్ర ఆందోళన కలిగించేవే.
ఆత్మహత్యకు గల కారణాలను పరిశీలిస్తే; దేశంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో లాగానే, హెచ్.సి.యు. లో కూడా కుల సంఘాలు, మావోయిస్ట్ సానుభూతి సంఘాలు, ముస్లిం అతివాద సంఘాలు, హిందూ అతివాద సంఘాలు, మితవాద సంఘాలు ఉన్నాయి. యాకుబ్ మెమన్ ఉరిశిక్ష అమలు సందర్భంగా దాన్నివ్యతిరేకిస్తూ అంబేద్కర్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రోహిత్ సహా కొందరు విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. దీన్ని ఖండిస్తూ ఏబివిపి నాయకుడు సుశీల్ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్న దానిపై భిన్న వాదనలు ఉన్నాయి. దీనిపై ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిందని సుశీల్ పై అంబేద్కర్ విద్యార్థి సంఘం నాయకులు దాడి చేసారనేది ఒక వాదన. అలాంటిదేమీ జరగలేదని ఒక వాదన. మొదటి వాదనని నమ్మిన యూనివర్సిటీ (పోలీసు కేసులు వగైరా చూసి) అధికారులు రోహిత్ సహా మరో నలుగురు విద్యార్థుల్ని సస్పెండ్ చేయడం, ఈ మధ్యలో దత్తాత్రేయ ఉత్తరం ఇవన్నీ మనకి తెలిసినవే. ఒకవేళ నిజంగా సుశీల్ పై దాడి జరిగి ఉంటే, విద్యార్థుల్ని సస్పెండ్ చేయడం సమంజసమే. దాడి జరగకుండా తప్పుడు ఆధారాలు చూపి, విద్యార్థుల్ని సస్పెండ్ చేస్తే దానికి బాధ్యులని శిక్షించాల్సిందే. త్వరగా న్యాయం జరగాలని ఇరువర్గాలు ఆందోళన చేయడం కూడా సమంజసమే. అయితే..
ఈ ఘటన దళితులకి అగ్రవర్ణాల వారికి మధ్య జరిగిన సంఘటన కాదు. దళితులు తమ హక్కుల కోసం పోరాడితే, ప్రశ్నిస్తే, దాన్ని అగ్రవర్ణాలు అడ్డుకుని హింసకు దిగితే, లేదా ఇబ్బందులకి గురి చేస్తే అప్పుడు దాన్ని కులపరమైన ఘర్షణగా చూడాలి. కాని, ఇక్కడ జరిగింది యాకుబ్ మెమన్ ఉరిశిక్షను వ్యతిరేకించే వ్యక్తులకి, సమర్థించే వ్యక్తులకి మధ్య ఘర్షణ. దీన్ని రెండు వాదనల మధ్య ఘర్షణగా చూడాలి తప్ప దళిత అగ్రవర్ణాల మధ్య ఘర్షణగా కాదు. దళిత విద్యార్థి ఆత్మహత్య అని పత్రికలూ బ్యానర్ ఐటమ్స్ రాయడం, ఆ కోణంలో టీవీ చానల్స్ చర్చలు జరపడం, కేవలం సమాజంలో విద్వేషాలు పెంచడానికి తప్ప మరెందుకూ ఉపయోగపడదు. పోనీ కులాల పేరుతోనే రిపోర్టింగ్ చేయాలని అనుకుంటే, ఆత్మహత్య చేసుకున్నవ్యక్తి కులాన్ని ప్రస్తావించే మీడియా, ఉత్తరం రాసిన కేంద్ర మంత్రి, బిసి అని ఎందుకు రాయలేదు? వివాదానికి కారణమైన సుశీల్ ది ఏ కులమో ఎందుకు రాయలేదు? నేషనల్ మీడియాగా చెప్పుకునే,టైమ్స్ నౌ వంటి మీడియా సంస్థలు కూడా గంటల తరబడి నిజాలని నిగ్గు తేల్చే విధంగ కాకుండా కేవలం దళిత కోణంలో మాత్రమే డిబేట్ నిర్వహించడం మీడియాలో సాగుతున్న అనైతిక ప్రవర్తనకి ఒక చిన్న ఉదాహరణ మాత్రమె.. షేమ్ ఆన్ ఇండియన్ మీడియా.